Wednesday, 14 March 2018


రాకరాక రాగ రత్తమ్మ యేరాలు 
ముచ్చటించి పోవ మూడునాళ్ళు
కోమటింటి లోన కొనితెచ్చిన మరమ
రాల వండి పెట్టె రమణి రుచిగ

చెట్టునుండి కొన్ని చింతకాయలు నేల
రాల, వండిపెట్టె రమణి రుచిగ
చింతపులుసు పోసి చేపల కూరను,
వచ్చి తినగ పతియె మెచ్చుకొనుచు

పుట్టినిల్లు కదిరి మెట్టి నిల్లయ్యె చీ
రాల, వండి పెట్టె రమణి రుచిగ 
కదిరి నుండి రాగ కాంతయ్య మామయె; 
కబురు లడిగి యతని గారవించె

Monday, 12 March 2018


అర్ధ చంద్రుని యాకార మమరినట్టి 
తియ్యని పదార్థ మొక్కటి తెచ్చి రొకరు 
హీర దానిని పసిగట్టి చేరవచ్చె;
“చీమ ముద్దాడెఁ జంద్రునిఁ జిత్రముగను”

డోల లూగుచుఁ నిదురించు బాలకుండు,
బాలచంద్రుడు రోదించె, వానిఁ గుట్టఁ 
జీమ; ముద్దాడెఁ జంద్రుని జిత్రముగను
ముద్దు మాటలాడుచుఁ నమ్మ బుజ్జగించి.



దునుమాడె రాక్షసులఁ నాఁ 
హనుమంతుడు లంక కేగి, యసువులఁ బాసె
న్ననిలో నక్షకుమారుడె;
పనిగొని దహియించెఁ నపుడు పావని లంకన్ 


ప్రవచన కర్తయె చాగం
టి వచించును భక్తి కథలు టీకా తోడన్ 
వివరించుచు నెన్నియొ, యో 
రవి ! చెప్పెను విష్ణు కథలు రంజిల్ల జనుల్


సవివరముగ భక్తి కథల 
నవలీలగ జెప్పువార లఱగొఱ యుండన్ 
సవర య్యనబడు నొక్క కు
రవి చెప్పెను విష్ణు కథలు రంజిల్ల జనుల్


చెవి యొగ్గి విన ననూరుడు
రవి చెప్పెను విష్ణు కథలు; రంజిల్ల జనుల్ 
ప్రవచించె నాదిభట్లయె; 
చెవి కింపగునట్టి కథలు శ్రేయము గూర్చున్.

భార్యను ధనములను పణముగ బెట్టుచున్
పందె మాడువారు వ్యసనపరులు
ఉబుసుపోక కొరకు నూరకనే పులి
జూద మాడువారు సుజనవరులు
కష్టపెట్టఁ సతిని దుష్టుఁ డా కురురాజు
భీకరముగఁ జంపె భీమసేను

డతనిఁ; దుస్ససేనుఁ నడచె రౌద్రుడగుచుఁ
రుధిరఁ మానె వాని రొమ్ము జీల్చి

రావణునిగ నటియించిన
భావాటుడు రామరావె భాసించెను రా
మావేశ వేషమునఁ నా
రావణుఁడే రాముఁ డగుచు రావణుఁ జంపెన్